ప్రశ్న:- ”నా వయస్సు 18 సంవత్సరాలు. 16వ ఏట నుంచి నాకు బావ, మావయ్య, వరుసవాళ్లు తగిలితే బాగుంటున్నది. ఈ మధ్య బావ వరస అయే అతను వస్తే అతనిపై ఇష్టం కలిగింది. మా అత్తయ్య గమనించి మందలించింది. ఇలా ఇద్దరు ముగ్గురిపై ఆకర్షణ ఏర్పడింది. మళ్లీ కొత్తగా నాకు వరసైన వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. ఇది తెలిసి మా అత్తయ్య ఎంతమందిని ఇష్టపడతావని కోప్పడింది. నా ఆలోచనల్లో తప్పుందా? ఎందుకిలా శరీరం తపన పడుతుంది?”
జవాబు:- సాధారణంగా ఆడపిల్లలకి తమ బావ మీద, మావయ్య మీద ప్రత్యేక అభిమానం ఉంటుంది. వాళ్ళ మీద కొంత ఆకర్షణ కూడా ఉంటుంది. వయస్సు వచ్చిన తర్వాత లైంగిక ప్రేరణలు కలుగుతాయి. ఇంటి కట్టుబాటు వల్ల తక్కిన మగపిల్లలతో తేలికగా కలవడం ఉండదు. కాని వారి లైంగిక ప్రేరణకు మగవాళ్ళతో పరిచయం అవసరం అనిపిస్తుంది. మావయ్య, బావలతో ఆ పరిచయం అతి తేలికగా లభ్యం అవుతుంది. వాళ్ళతో ఎంత క్లోజ్‌గా ఉన్నా సరసమైన జోక్‌లు వేస్తున్నా ఇంట్లో వాళ్ళు తేలికగా తీసుకుంటారు. ఈ విధంగా మావయ్యలతోను, బావలతోనూ వాళ్ళల్లో కలిగే లైంగిక స్పందనలకు తృప్తిని పొందుతారు. చదువులకోసం బయటకు వెళ్ళిన ఆడపిల్లలు, కో-ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో చదివే ఆడపిల్లలు సహాధ్యాయులైన మగపిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ పరిచయంతో తెలియని హాయి పొందుతారు. ఇటువంటి వాళ్ళు మావయ్యల మీద, బావల మీద అంతగా మనస్సు పారేసుకోరు. వాళ్ళ కోసం తహతహలాడరు. ఇతర మగపిల్లలతో కలిసే అవకాశం లేని ఆడపిల్లలు లేదా కలవడానికి జంకు ఉన్న ఆడపిల్లలు తన బావలతో, మావయ్యలతో క్లోజ్‌నెస్ పెంచుకుంటారు. పైగా వాళ్ళను పెళ్ళి చేసుకుంటే వాళ్ళ జీవితాలకు భద్రత ఉంటుందని అనుకుంటారు. పరాయి వాళ్ళను పెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారో అని భయపడతారు. మీ విషయంలో కూడా ఇటువంటి సైకాలజీయే పనిచేస్తోంది. మీలోని లైంగిక ప్రేరణలే మావయ్య, బావ వెంటపడేటట్లు చేస్తుంది. కాస్త విజ్ఞత ఉపయోగించి మీ మనస్తత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి.