ప్రశ్న:- ”వేడిచేస్తే కళ్ళు ఎర్రబడతాయా? వేడి తగ్గడానికి ఏం చేయాలి? ఏం తాగాలి?”
జవాబు:- వేడి అనేది లేనేలేదు. కళ్ళు ఎర్రబడటానికి ఏదో ఒక కారణం ఉంటుంది. సాధారణంగా కళ్ళు ఎర్రబడటానికి కళ్ళకలక కారణం. బాక్టీరియా క్రిములు వచ్చి కళ్ళ కలక వస్తే కళ్ళు ఎర్రబడటమే కాకుండా కళ్ళు పుసులు కడతాయి. ఇటువంటి వాళ్ళు డాక్టరు సలహాపై జెంటమైసిన్ లేదా సిప్రాఫ్లోక్లాసిన్ ఐ డ్రాప్స్ వాడితే తగ్గిపోతాయి. కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు ఎర్రబడతాయి. దుమ్ము, ధూళి పడ్డప్పుడు కూడా కళ్ళు ఎర్రబడతాయి. ఎక్కువ వెలుతురు కళ్ళల్లోకి పడ్డప్పుడు కూడా కళ్ళు ఎర్రబడతాయి. పెద్దవాళ్ళల్లో లాక్రీమియా గ్లాండ్స్ తగినంత పనిచేయక కంటిలో తడి తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎండలో ఎక్కువ తిరిగినా, వీడియో లైట్లకి గురైనా, నిద్రలేకపోయినా కళ్ళు త్వరగా డ్రై అయ్యి ఎబ్రడతాయి. ఇటువంటి పరిస్థితి గురించి ఐ లూబ్రికెంట్ డ్రాప్స్ డాక్టరు సలహా మేరకు వాడితే కళ్ళు ఎర్రబడవు. కళ్ళు ఎర్రబడటానికి వేడి చేయడం కారణం అనుకుని ఏవేవో తాగడం, తినడం చేస్తే ఫలితం ఉండదు. వేడి చేయడం అనేది మూఢ నమ్మకం మాత్రమే. కళ్ళు ఎర్రబడినప్పుడు డాక్టరుకి చూపించుకుని చికిత్స పొందాలి.