ప్రశ్న:- ”నా వయస్సు 15 సంవత్సరాలు. ఏడో తరగతి పరీక్ష పాసయ్యాను. కాని ఇంకా రజస్వల కాలేదు. వక్షోజాలు అసలే లేవు. మా స్కూల్లో 5వ తరగతి చదివే అమ్మాయిలకి కూడా వక్షోజాలు ఉన్నాయి. నా స్నేహితుల్లో చాలా మంది ఏడవ తరగతి, 8వ తరగతిలోనే రజస్వల అయ్యారు. నేను రజస్వల కాకపోవడంతో నా స్నేహితురాండ్రు తెగ ఎగతాళి చేస్తున్నారు. నేను అందరు అమ్మాయిలలాగా రజస్వల అవడం ఉండదా? పెళ్లికి పనికి రాకుండా పోతానా?”
జవాబు:- సాధారణంగా ఆడపిల్లలు 12-14 సంవత్సరాల మధ్య వయస్సులో రజస్వల అవుతారు. కొంతమంది 12 సం||ల ముందు, 14 సం||ల తర్వాత రజస్వల అవుతారు. 15-16 సంవత్సరాలు నిండినప్పటికీ రజస్వల కాకపోతే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇటువంటి అమ్మాయిల్లో హార్మోన్ల లోపం ఉండవచ్చు. గర్భాశయం ఎదగకుండా అతి చిన్నదిగా ఉండిపోవచ్చు. అరుదుగా కొందరిలో అసలు గర్భాశయమే ఉండదు. అందుకని మీరు డాక్టరుకి చూపించుకొని అల్ట్రాసౌండు స్కానింగ్, హార్మోను టెస్టులు చేయించుకోండి. కారణం బట్టి చికిత్స చేస్తే ఫలితాలు బాగానే ఉంటాయి.