Tuesday, December 6, 2022
spot_img

మీకు సివిల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ఉంది

ప్రశ్న:- ”నేనొక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. అతనికి కూడా నేనంటే ఎంతో ఇష్టం. ఏమైనా సరే మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాం. మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో తెలిసిపోయింది. రెండు కుటుంబాల్లోనూ మా పెళ్ళిని ఒప్పుకోలేదు. పైగా విడదీయాలనుకున్నారు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేము. వెంటనే పెళ్ళి చేసుకుందామని స్నేహితుల అండతో గుడికి వెళ్ళాము. గుళ్ళో పూజారి ఇద్దరు మతాలు వేరు కనుక పెళ్ళి చేయనన్నాడు. మా పేరెంట్స్‌ మమ్మల్ని వేరు చేస్తారు లేదా చంపేస్తారని తెలుసు. గాఢమైన ప్రేమకి చివరి పరిష్కారం చావేనా? మీరే మాకు సరైన సలహా ఇచ్చి మాకు పెళ్ళి అయ్యేటట్టు చేయండి.” 

జవాబు:- మానవులంతా ఒక్కటే. ఈ మతాలు, కులాలు మధ్యంతరంగా వచ్చిన అడ్డుగోడలు. వీటిని తప్పకుండా పగులగొట్టాలి. ప్రేమించుకున్నవాళ్ళు పెళ్ళితో తప్పకుండా ఒకటవ్వాలి. గుడిలో పెళ్ళి చేయకపోయినా, మసీదులో పెళ్ళి చేయకపోయినా, చర్చిలో పెళ్ళి చేయకపోయినా ఏం ఫర్వాలేదు. సివిల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం వర్ణాంతరం, మతాంతరం వివాహాలైనా, మామూలు వివాహాలైనా మేజర్లైన యువతీ యువకులు నిర్భయంగా చేసుకోవచ్చు. సివిల్‌ మ్యారేజ్‌ పద్ధతికి కులాలు, మతాలు ఏవీ అడ్డు రావు. మీరు వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్ళి మ్యారేజ్‌ చేసుకుంటామని తెలియజేయండి. వాళ్ళు మీ బంధువులు కానవసరం లేదు. కేవలం శ్రేయోభిలాషులు అయితే చాలు. 

మీ పేరెంట్స్‌ లేదా టతరులు మీకు హాని కలిగిస్తారనే భయం ఉంటే మీ దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్‌లో రక్షణ కోరండి. తప్పకుండా పోలీసుశాఖ నుంచి రక్షణ లభిస్తుంది. మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. ఎంత ఎక్కువగా వర్ణాంతర, మతాంతర వివాహాలు జరుగుతాయో అంత ఎక్కువగా పెళ్ళిళ్ళ విషయంలో కులం కట్టుబాట్లు, మతం కట్టుబాట్లు తొలగుతాయి. అంతేకాకుండా ప్రతి వ్యక్తి నేను ఏ కులానికి చెందను, మతానికి చెందను, నేను విశ్వమానవుడినని అనుకుంటే త్వరితంగా ఈ అడ్డుగోడలు తొలగిపోతాయి. యువతీ యువకులు అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలి. కులాల, మతాల పట్టింపు లేకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి. సాంప్రదాయ వివాహాలు కాకుండా సివిల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. దాంతో త్వరగా సమాజం మారుతుంది. మీలాంటి ప్రేమికులకు కష్టాలు లేకుండాపోతాయి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!